Ysrcp: మైనారిటీ కుటుంబానికి వేధింపులు... నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే

131

చేనేత కార్మికుడికి వైకాపా నేతల బెదిరింపుఅవమానంతో మైనారిటీ వర్గీయుడి ఆత్మహత్యాయత్నం

బాకీ ఉన్న డబ్బు కోసం బెదిరించడంతో పాటు నీ భార్యను అమ్మేసైనా సొమ్ము కట్టాలంటూ వైకాపా నాయకులు అవమానించడంతో మనస్తాపానికి గురై మైనార్టీ వర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

గురువారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ దారుణం జరిగింది. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం శాంతినగర్‌లో ఇలియాజ్‌ చేనేత మగ్గం నేస్తూ చీరల వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన వైకాపా వర్గీయులైన చీరల వ్యాపారులు తేజ, బాలకృష్ణ వద్ద 20 పట్టుచీరలు తీసుకున్నారు. వాటిలో 6 మాత్రమే అమ్ముడుపోగా, వాటికి మాత్రం డబ్బులు ఇచ్చి, మిగిలిన 14 చీరలను వెనక్కు ఇచ్చేస్తామని వ్యాపారులకు తెలిపారు.

అందుకు అంగీకరించని చీరల వ్యాపారులు తేజ, బాలకృష్ణ పంచాయితీ పెట్టించారు. ఈ మేరకు కౌన్సిలర్‌ నారాయణరెడ్డి, వైకాపా వర్గీయుడైన రెడ్డప్ప సోమవారం రాత్రి తన భర్తను బెదిరించారని ఆయన భార్య సల్మా తెలిపారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు కూడా పిలిపించారని చెప్పారు. పోలీసు అధికారి చెప్పిన మేరకు మంగళవారం 14 చీరలు వ్యాపారులకు వెనక్కి ఇచ్చేశామని పేర్కొన్నారు. అయితే ఆ తరువాత వారు మళ్లీ వచ్చి తమకు రూ. 7 లక్షల విలువైన 41 చీరలు ఇవ్వాల్సి ఉందంటూ.. ఇలియాజ్‌తో బలవంతంగా తెల్లకాగితంపై రాయించుకున్నారని సల్మా ఆరోపించారు. తేజ బుధవారం నుంచి మరోసారి బెదిరింపులకు దిగారని, 'నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే' అని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top