న్యాయంగా ఆ పదవి నాకు దక్కాలి- ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

171

తెలంగాణ రాజకీయాల్లో పదవుల వివాదం మరోసారి తెర మీదికి వచ్చింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడిన మూడో రోజే మరో కాంట్రావర్సీ మొదలైంది.

ప్రొటెం స్పీకర్ (Pro-tem Speaker)గా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ను అపాయింట్ చేయడంపై దుమారం చెలరేగింది. ఆయన సారథ్యంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరాకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు.

ప్రొటెం స్పీకర్ ఎంపిక రాజ్యంగబద్ధంగా జరగలేదనేది బీజేపీ ఎమ్మెల్యేల ఆరోపణ. శాసన సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక చేయాల్సి ఉంటుందని, అలాకాకుండా ఏఐఎంఐఎంతో ఉన్న దోస్తీ కారణంగానే అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. ముస్లింల సంతుష్టీకరణకు తెర లేపిందని ధ్వజమెత్తుతోంది.

అక్బరుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తొలిసారిగా ఆయన చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయనకు ఓటమి అనేది ఎదురుకాలేదు. ప్రస్తుత శాసనసభలో సీనియర్ సభ్యుల్లో ఆయనా ఒకరు.

అక్బరుద్దీన్ కంటే సీనియర్.. కాంగ్రెస్‌కు చెందిన నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏడుసార్లు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు హూజూర్ నగర్ నుంచి మూడుసార్లు కోదాడ నుంచీ గెలుపొందారు. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాల్సి ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేదు.

Also Read: TS Ministers: తెలంగాణ ఐటి మినిస్టర్

ఈ వివాదంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రొటెం స్పీకర్ పదవి తనకే దక్కాలని, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల అది సాధ్యపడలేదని అన్నారు. తన తరువాత సీనియారిటీ ఉన్న సభ్యుడిగా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చి చెప్పారు.

మజ్లిస్‌తో దోస్తీ విషయాన్ని తోసిపుచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. మజ్లిస్‌తో భవిష్యత్తులో పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. అందరితో చర్చించిన తరువాతే హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top